Bajaj Chetak | చేతక్ స్కూటర్..1980వ దశకంలో పాపులర్ టూ వీలర్.. కానీ, తర్వాతర్వాత రకరకాల బైక్స్, మోటార్ సైకిళ్లు మార్కెట్లోకి వచ్చాయి. అధునాతన టెక్నాలజీ వచ్చాక బైక్స్, మోటారు సైకిళ్లపైనే కుర్రకారు మోజు పెంచుకున్నారు.. కానీ పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు కాలుష్య నియంత్రణ అంశం ముందుకొచ్చింది. ఈ దశలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది బజాజ్ ఆటో.. ఇప్పుడు బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ కోసం కొనుగోలుదారులు వెయిటింగ్ పీరియడ్‌లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో మార్కెట్లో గిరాకీకి అనుగుణంగా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Bajaj Chetak EV) ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెంచాలని నిర్ణయించినట్లు బజాజ్ ఆటో (Bajaj Auto) తెలిపింది. వీటి ఉత్పత్తిలో వచ్చే రెండు నెలల్లో 10 వేల యూనిట్ల మైలురాయికి చేరుకోవాలని భావిస్తోంది. అలాగే, తన సేల్స్ నెట్వర్క్ కూడా పెంచుకోవాలని తలపోస్తున్నది బజాజ్ చేతక్. వచ్చే సెప్టెంబర్ నాటికి సొంతంగా 150 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లు ఓపెన్ చేయాలని చూస్తున్నట్లు సంస్థ ఈడీ రాకేశ్ శర్మ చెప్పారు.
ఇప్పటికైతే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు నెలకు ఐదువేలు ఉత్పత్తి అవుతున్నాయని, తొలుత దీన్ని 7,000లకు పెంచాలని యోచిస్తున్నామని రాకేశ్ శర్మ తెలిపారు. గిరాకీని బట్టి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. వచ్చే జూన్ నెలాఖరు నాటికి 10 వేల యూనిట్ల మైలురాయిని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ విడి భాగాల తయారీలో కొందరు వెండర్ల జాప్యం వల్ల తమ స్కూటర్ల ఉత్పత్తిపై ప్రభావం పడిందని తెలిపారు. ఇప్పుడా సమస్య పరిష్కరించుకున్నామని, దీంతో బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ల ఉత్పత్తి పెంపుపై విశ్వాసం పెరిగిందన్నారు.
ప్రస్తుతానికి బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ బుక్ చేసుకున్న వారు 20 నుంచి 25 రోజుల వరకు వెయిట్ చేయాల్సి వస్తున్నది. వచ్చే నెల నుంచి మూడు నుంచి ఐదు రోజులకు తగ్గుతుందని ఆశిస్తున్నామని రాకేశ్ శర్మ వివరించారు. ఇప్పుడు బజాజ్ చేతక్‌కు దేశవ్యాప్తంగా 88 పట్టణాల్లో 105 డీలర్‌షిప్‌లు ఉన్నాయన్నారు. వచ్చే సెప్టెంబర్ నాటికి ఈ స్టోర్లను 120 పట్టణాల్లో 150 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లకు పెంచాలని భావిస్తున్నామని తెలిపారు.