Home Buying Tips | ప్రతి ఒక్కరూ తమకంటూ సొంతిల్లు కావాలనుకుంటారు. ఆర్థిక వనరులు సమకూరినప్పుడు గానీ, మంచి వేతన ప్యాకేజీ లభిస్తే ఇంటి రుణంపై సొంతిల్లు కొనుక్కోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన స్థలంలో గానీ, సొంతంగా కొనుక్కున్న స్థలంలో గానీ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. అలా కుదరని పక్షంలో ఒక డెవలపర్ దగ్గర కట్టిన ఇల్లు కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేసే ఇంటిపైన అదనపు ఖర్చులుంటాయి. ఇటువంటి వాటి గురించి ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు.
కొనుక్కున్న ఇంటికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇల్లు కొన్న వారు దాని రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి స్టాంప్‌డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది. ఈ స్టాంప్ డ్యూటీ రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంటుంది. స్టాండ్ డ్యూటీ ఐదు నుంచి ఏడు శాతం వరకు విధిస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు. స్టాంప్ డ్యూటీ చెల్లించినా.. రిజిస్ట్రార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఒకటి నుంచి రెండు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే గానీ.. ఆ ఇల్లు మీ సొంతం అవుతుంది. మీరు కొన్న ఇంటి ధరను బట్టి స్టాంప్ డ్యూటీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది.
సొంతిల్లు కొంటున్నామన్న సంతోషంలో కొందరు తమ ఇంటికి పార్కింగ్ సౌకర్యం ఉందా.. లేదా.. అన్న సంగతి విస్మరిస్తుంటారు. మన సొంతిల్లే కనుక పార్కింగ్ ఉంటుందని భావిస్తుంటారు. కానీ, బిల్డర్లు, హౌసింగ్ సొసైటీలు పార్కింగ్ ప్లేస్ కోసం కొంత చార్జీ వసూలు చేస్తాయి. ఒకటి కంటే ఎక్కువ వెహికల్స్ పార్కింగ్ చేస్తే ఎక్కువ మొత్తం పే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుగోలు చేసినప్పుడు పార్కింగ్ స్పేస్ కోసం డబ్బు చెల్లించకుంటే.. సంబంధిత బిల్డర్.. ఆ పార్కింగ్ ప్లేస్ ఇతరులకు అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది.
నిర్మాణంలో ఉన్న ఇంటికి జీఎస్టీ పే చేయాలి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులాగే జీఎస్టీ కూడా సర్కార్‌కు చెల్లించే ఫీజు. ఆ ఇండ్ల ధరను బట్టి ఒకటి నుంచి ఐదు శాతం వరకు జీఎస్టీ పే చేయాల్సిందే. నిర్మాణం పూర్తయిన ఇండ్లకు, రీసేల్ ఇండ్లకు జీఎస్టీ నిబంధన వర్తించదు. ఒకవేళ అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుగోలు చేస్తే బిల్డర్ నిర్వహణ ఫీజు పే చేయాలి. పాత అపార్ట్మెంట్ ప్లాట్ కొన్నా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇల్లు లేదా ప్లాట్ కొన్న ప్రాంతాన్ని బట్టి నిర్వహణ చార్జీ ఖరారు చేస్తారు. అపార్ట్మెంట్ ప్లాట్‌కు ఇక విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఈఈసీ, పవర్ బ్యాకప్ చార్జీలు పే చేయాల్సి ఉంటది.
కొందరు మధ్యవర్తుల ద్వారా ఇండ్లు కొనుగోలు చేస్తుంటారు. అలా ఇల్లు కొన్న వారు.. సదరు మధ్యవర్తికి బ్రోకరేజీ చార్జీ పే చేయాల్సి వస్తుంది. ఇంటి విలువను బట్టి రెండు శాతం వరకు బ్రోకరేజీ చార్జీ ఖరారు చేస్తారు. ఇల్లు కొన్నప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ కోసం భారీగానే చేతి చమురు వదులుతుంది అంటే ఖర్చవుతుంది. పెయింటింగ్, ప్లంబింగ్, న్యూ ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలు ఉంటాయి.
లోన్ ద్వారా ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు చేస్తే లోన్ ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ వెరిఫికేషన్, మోర్టగేజ్ రిజిస్ట్రేషన్ తదితర ఫీజులు అదనం. ఇవన్నీ కలిసి ఇంటి ధర మీద అదనంగా 15 శాతం వరకు పెరగొచ్చు. ఇంటి రుణం ద్వారా సొంతిల్లు కొనుక్కునే వారైతే డౌన్ పేమెంట్‌తో పాటు ఈ అదనపు ఖర్చులన్నీ సిద్ధం చేసుకుని ముందడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.