న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : మరోసారి కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనానికి తెరలేపుతున్నదా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ‘వికసిత్ భారత్ 2047’ విజన్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద బ్యాంకుల్లో మరిన్ని దేశీయ బ్యాంకులకు చోటు కల్పించే లక్ష్యంతో మరో కీలక అడుగువేయబోతున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో శుక్రవారం సమీక్షను నిర్వహించింది. అంతర్జాతీయంగా ఉన్న టాప్-20 బ్యాంకుల్లో రెండు దేశీయ బ్యాంకులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో జరిగిన ఈ సమావేశంలో మరిన్ని బ్యాంకుల విలీనం చేసే అవకాశాలపై చర్చించినట్టు తెలుస్తున్నది. ఆర్థిక సేవల విభాగం ఏర్పాటు చేసిన పీఎస్బీ మంథన్ 2025 తొలి రోజు సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి.
ప్రస్తుతం ఆస్తుల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో టాప్-100లో కేవలం రెండు బ్యాంకులకు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. వీటిలో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 43వ స్థానంలోనూ, ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 73వ స్థానంలో కొనసాగుతున్నది. కీలక విషయాలపై ప్రధానంగా చర్చించడం జరిగిందని, కనీసంగా రెండు బ్యాంకులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు, ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి, పీఎన్బీ సీఈవో అశోక్ చంద్ర, ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్, డీఎఫ్ఎస్ మాజీ కార్యదర్శి, ఐఆర్డీఏఐ మాజీ చైర్మన్ దేబాశిష్ పాండే తదితరులు హాజరయ్యారు.