న్యూఢిల్లీ, జనవరి 24: రాబోయే బడ్జెట్లో పన్ను ప్రోత్సాహకాలివ్వాలని దుస్తుల ఎగుమతిదారుల సంఘం ఏఈపీసీ బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో బట్టల తయారీకి మద్దతునిచ్చేలా, ఎగుమతులు పెరిగేలా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో ఒకే శ్లాబ్, వడ్డీ రాయితీల పెంపు వంటి నిర్ణయాలు తీసుకోవాలని అప్పారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆయా రంగాల నుంచి డిమాండ్లు, విజ్ఞప్తులు, ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే పర్యావరణ, సామాజిక, కార్పొరేట్ గవర్నెన్స్ (ఈఎస్జీ)తోపాటు ఇతరత్రా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, నిబంధనల్ని ఆచరిస్తున్న దుస్తుల తయారీదారులకు పన్ను ప్రోత్సాహకాల్ని కల్పించాలని ఏఈపీసీ కోరింది. అలాగే స్వదేశీ ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్‌కు బడ్జెట్లో నిధుల్ని కేటాయించాలనీ విన్నవించింది. ‘ఎగుమతిదారులకు అధిక వడ్డీరేట్ల వల్ల మూలధనం సమకూర్చుకోవడం చాలా కష్టంగా మారుతున్నది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లతోపాటు పెద్ద సంస్థలకూ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలి’ అని ఏఈపీసీ డిమాండ్ చేసింది. అంతేగాక చేనేత వస్ర్తాలన్నింటిపైనా జీఎస్టీని 5 శాతానికే పరిమితం చేయాలన్నది. ఫైబర్, యార్న్, ఫ్యాబ్రిక్‌పై ఇప్పుడు జీఎస్టీ రేట్లు వరుసగా 18, 12, 5 శాతంగా ఉన్నాయి. వీటన్నిటిపై 5 శాతమే జీఎస్టీ ఉండాలని ఏఈపీసీ ప్రధాన కార్యదర్శి మిథిలేశ్వర్ థాకూర్ కోరుతున్నారు.
స్పేస్ ఇండస్ట్రీ నుంచి..
రక్షణ రంగ పరిశ్రమలతో సమానంగా ఉదార విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాన్ని కోరుతున్నది దేశీయ అంతరిక్ష పరిశ్రమ. వచ్చే బడ్జెట్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలనూ (పీఎల్ఐ) ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. అలాగే శాటిలైట్లు, లాంచ్ వెహికిల్స్, గ్రౌండ్ ఎక్విప్మెంట్ తయారీకి జీఎస్టీ మినహాయింపుల్నీ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అడుగుతున్నది. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్‌కు తక్కువ వడ్డీరేట్లు ఉండాలని, శాటిలైట్ రంగానికి పన్నుల్ని 10 శాతం నుంచి 2 శాతానికి దించాలనీ చెప్తున్నది. ‘భారతీయ స్పేస్ ఇండస్ట్రీలోని సంస్థలు ఒక్క శాతం ఎఫ్‌డీఐ కోసం కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలంటే నెలల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది. కానీ రక్షణ రంగ సంస్థలు 74 శాతం ఎఫ్‌డీఐని ఆటోమేటిక్ మార్గం గుండానే అందుకుంటున్నాయి’ అని బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పిక్సెల్ వ్యవస్థాపక సీఈవో అవైస్ అహ్మద్ అంటున్నారు. దేశీయ స్పేస్ పరిశ్రమ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని, పన్నులపరమైన ఇబ్బందులూ ఉన్నాయని, వాటికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందంటూ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్.. లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఏకే భట్ అంటున్నారు. కాగా, 2033 నాటికి స్పేస్ ఎకానమీ 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.