మీకు తెలుసా? డెబిట్ కార్డ్‌లపై వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుందని! ఇది ఉచితమని, ఎటువంటి ప్రీమియం చెల్లించనక్లర్లేదని! చాలా మంది బ్యాంక్ ఖాతాదారులకు ఈ విషయం
తెలియనే తెలియదు. ఎందుకంటే బ్యాంక్‌లు ప్రత్యేకంగా ఈ బీమాను కస్టమర్లకు నేరుగా తెలియపర్చవు. అందుకే కార్డ్ హోల్డర్ల నామినీ లేదా వారసులు దీనిని క్లెయిమ్ చేయరు. డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డులకు కాంప్లిమెంటరీ వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయాన్ని ఆటోమేటిక్‌గా బ్యాంక్‌లు ఆఫర్ చేస్తాయి. బ్యాంక్ ఖాతాదారులు డెబిట్ కార్డ్‌లపై ఏ బీమా పాలసీలను ఆఫర్ చేస్తున్నాయో వారి బ్యాంక్‌ల ద్వారా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బీమా మొత్తం ఇలా..
బ్యాంక్‌లు ఆఫర్ చేసే వివిధ రకాల డెబిట్ కార్డ్‌లపై రూ.లక్ష నుంచి రూ. 10 లక్షల వరకూ ప్రమాద బీమా ఉంటుంది. ప్రమాదం కారణంగా మృతి చెందితే ఈ బీమా అమలవుతుంది. ఖాతాదారు యాక్సిడెంట్లో మరణిస్తే ఈ బీమా ప్రయోజనం ఖాతాదారు…నామినీ లేదా చట్టబద్దమైన వారసులకు లభిస్తుంది. విమాన ప్రయాణానికి మరో ప్రమాద బీమా సదుపాయాన్ని బ్యాంక్‌లు ఆఫర్ చేస్తున్నాయి.
రూపే డెబిట్ కార్డ్‌లపై కూడా…
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై)లో భాగంగా తెరిచిన జన్‌ధన్ ఖాతాల రూపే డెబిట్ కార్డ్‌లపై కూడా ఈ ప్రమాద బీమా అమలవుతోంది. 2018 ఆగస్టు 28కు ముందు జారీ అయిన రూపే కార్డ్‌లపై రూ.లక్ష, అటుతర్వాత జారీఅయిన రూపే కార్డ్‌లపై రూ.2 లక్షల ప్రమాద బీమా ఉంటుంది.
కనీసం ఒక లావాదేవీ జరిగితేనే…
ప్రమాద మరణానికి ముందు 90 రోజుల్లో ఖాతాదారు డెబిట్ కార్డ్ ద్వారా ఒక్క లావాదేవీ అయినా చేసి ఉంటేనే ఈ ఉచిత బీమా నామినీకి అందుతుంది. అలాగే మృతి సంభవించిన తర్వాత ఖాతాదారు నామినీ…ప్రమాద తేదీ నుంచి 90 రోజుల్లోగా బ్యాంక్‌కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన 60 రోజుల్లోగా క్లెయిమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాలి. అప్పుడు ప్రమాద బీమా మొత్తం నామినీ చేతికి అందుతుంది.