Beauty Tips | నా వయసు 30 సంవత్సరాలు. ఉన్నత చదువుల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నాను. నాది గుండ్రటి ముఖం. ఈ మధ్య బుగ్గలు బాగా తగ్గిపోయాయి. ముఖం పల్చగా అయిపోయింది. మళ్లీ బుగ్గలు రావాలంటే ఏం చేయాలి?
– ఓ సోదరి
మీరు ఇంటికి దూరంగా ఉన్నానన్న ఆలోచన వల్ల బెంగ పెట్టుకున్నారేమో గమనించండి. అలాగే ఆహారం సరిగ్గా తినక బరువు ఏమైనా తగ్గారా… ఈ విషయాలు ఒకసారి చూసుకోండి. దీనివల్ల నీరసపడి ముఖం పీక్కుపోతుంది. కాబట్టి వేళకు తినే ప్రయత్నం చేయండి. ఇక బుగ్గలు పెరిగేందుకు అని ప్రత్యేక ఆహారం ఏమీ ఉండదు కానీ, ముఖం కళగా కనిపించడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు. విభిన్న రకాల తాజా పండ్లు ఎక్కువగా తీసుకోండి. పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగండి. శరీరంలో నీటి స్థాయులు తగ్గకుండా చూసుకోవాలి. అప్పుడు చర్మం తాజాగా కనిపిస్తుంది. అందుకోసం నీళ్లు ఎక్కువగా తాగండి. చక్కెర లేని తాజా పండ్ల రసాలు మేలు చేస్తాయి. అవిసె గింజలు, బాదం ఎక్కువగా తీసుకోండి. వీటివల్ల ముఖం కాంతిమంతంగా తయారవుతుంది. చివరగా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం చేయండి. ముఖవర్ఛస్సు మెరుగుపడుతుంది.
-మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com