అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికారం ఉన్నన్నాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీతో పాటు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం (Zakia Khanam) తన పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీకి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను మండలి చైర్మన్‌కు పంపించారు.
జకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయచోటి. ఆమెను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం మండలి వైస్ చైర్మన్‌గా నియమించింది. కాగా, అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఆమె గత రెండేండ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్‌ను కుటుంబ సమేతంగా కలిశారు. దీంతో ఆమె పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరింది. ఎట్టకేలకు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆమెతో కలిపి ఇప్పటివరకు వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, పోతుల సునీతలు ఉన్నారు.