Perni Nani | టీడీపీ అధినేత బందరులో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట అసత్యమేనని ఖండించారు. చంద్రబాబును తిట్టడానికే తనకు మంత్రి పదవి ఇచ్చారని.. తనను బూతుల నాని అని చంద్రబాబు విమర్శించారని గుర్తు చేశారు. తాను ఏ రోజైనా చంద్రబాబును గానీ.. పవన్ కల్యాణ్‌ను గానీ తిట్టానా అని ప్రశ్నించారు. మీరే జగన్‌ను ఇష్టం వచ్చినట్లు పచ్చిగా తిడతారని విమర్శించారు. ఏ రోజైనా మీ కుటుంబ విషయాలు మాట్లాడానా? అని ప్రశ్నించారు.
వయసు పెరిగిందికానీ.. ఎలా మాట్లాడాలో చంద్రబాబుకు తెలియదని పేర్ని నాని విమర్శించారు. మీ తీరుని ప్రశ్నిస్తే.. నేను బూతుల నానినా? అని మండిపడ్డారు. తన కుమారుడు కృష్ణమూర్తిపై గంజాయి నిందలు మోపడంపైనా పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల వయసు వచ్చిన చంద్రబాబువి అన్నీ పాపపుమాటలే అని అన్నారు. తన కుమారుడు రాజకీయాల్లోకి వద్దామని అనుకున్నప్పుడు.. చంద్రబాబులాంటి వాళ్లు ఉంటారు రాజకీయాలు వద్దని చెప్పా అని తెలిపారు. అయినా ప్రజాసేవే పరమావధి అని రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పారు.