అమరావతి : ఐదేండ్ల వైఎస్ జగన్ (YS Jagan) పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu) ఆరోపించారు. ఆయన పాలనలో అవతవకలు జరిగినట్టు కేంద్రం కూడా వెల్లడించిందని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటుందని వివరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visaka Steel Plant) ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మూడు శ్వేత పత్రాలు విడుదల చేయనున్నారని చెప్పారు. కేంద్ర నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని, కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో కేంద్ర పథకాలు ఆగాయని ఆరోపించారు .
కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తమపై ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) తో శనివారం టీడీపీ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో బడ్జెట్ అంశంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. ఢిల్లీ వేదికగానే జగన్ దుష్ప్రచారాన్ని తిప్పి కొడతామని తెలిపారు.