కోనసీమ జిల్లా : వైఎస్సార్ సన్నిహితుడు బొంతు రాజేశ్వర్‌రావు ఏపీ సీఎం జగన్‌కు షాకిచ్చాడు. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. రెండు సార్లు రాజోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతుదారుగా నిలిచి రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమవడంతో ఇదే స్థానంపై కన్నేసిన బొంతు రాజేశ్వర్‌రావు తన దారి తాను వెతుక్కున్నాడు.
కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు బొంతు రాజేశ్వర్‌రావు పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. రాజోలులో వైసీపీ కార్యకర్తలపైనే దాడులు జరుగుతున్నాయని, ఈ దీన పరిస్థితులను చూడలేకనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు రాజేశ్వర్‌రావు తెలిపారు. పవన్ కల్యాణ్‌తో కలిసి నడవాలని తన అనుచరులు కోరుకుంటున్నారని, త్వరలోనే వారితో కలిసి జనసేన పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక్కడ జనసేన నుంచి గెలిచిన వ్యక్తికి పార్టీ అగ్రతాంబూలం ఇవ్వడం తనతోపాటు కార్యకర్తలకు నచ్చడంలేదని, అందుకే దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తనను నమ్ముకుని ఉన్న కార్యకర్తల ఆకాంక్ష మేరకు తాను జనసేనలో చేరి వారిని రక్షించుకుంటానని చెప్పారు.
రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి రెండు సార్లు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బొంతు రాజేశ్వర్‌రావు ఓటమి చెందారు. ఇటీవలనే ప్రభుత్వ సలహాదారు పదవికి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజోలులో వైసీపీ బలహీనపడి జనసేన పట్టు నిలుపుకుంటుందని స్థానికులు చర్చించుంటున్నారు. గత కొన్నిరోజులుగా వైసీపీలో స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, రాజేశ్వర్‌రావు, పెదపాటి అమ్మాజీల వర్గం మధ్య వార్ నడుస్తున్నది. బొంతు రాజేశ్వర్‌రావు చాలా ఏండ్లుగా వైఎస్సార్ అనుచరిగా కొనసాగి.. వైసీపీ ప్రారంభించడంతో పార్టీలో చేరి రాజోలు స్థానానికి కీలకనాయకుడిగా ఎదిగారు.