తిరుపతి: ప్రేమించిన యువతితో వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారకంగా ఉన్న యువకుడిని స్థానికుల సాయంతో స్నేహితుడు తొలుత శ్రీసిటీ దవాఖానకు.. అక్కడి నుంచి రుయాకు తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందాడు. ఈ ఘటన తిరుపతిలోని దొరవారిసత్రం మండలంలో చోటుచేసుకున్నది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొరవారిసత్రం మండలం లింగంపాడు గ్రామానికి చెందిన వల్లంశెట్టి మునినాగయ్య రెండో కుమారుడు పార్థసారథి (25) స్థానికంగా ఓ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. అదే యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. అయితే జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేస్తామని వారు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
గతంలో తాను పనిచేసిన పరిశ్రమ వెనక ప్రాంతానికి వెళ్లిన పార్థసారథి.. అక్కడ క్రిమిసంహారక మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగాడు. జీవితాన్ని ముగిస్తున్నట్లు స్నేహితుడు నవీన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న నవీన్.. అపస్మారక స్థితిలో ఉన్న పార్థసారధిని స్థానికుల సాయంతో శ్రీసిటీ దవాఖానకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.