అమరావతి : మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) మరోసారి వైసీపీపై విరుచుకు పడ్డారు. వైసీపీ పాలనలో జరిగిన ప్రమాదాలను వివరిస్తూ తయారు చేయించిన ఫ్లెక్సీని (Flexi) ప్రదర్శించారు. రాబంధుల ముఠా.. ఇదిగో జగనాసుర రక్త చరిత్ర అంటూ ఫ్లెక్సీలో ముద్రించి జరిగిన ప్రమాదాల వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాటపై (Stampede) వైసీపీ (YCP) శవ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని మాజీ మంత్రి రోజా (Roja) బెంజ్‌కారు కొనుక్కుందని విమర్శించారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చనట్లుగా మాట్లాడవద్దని ఘాటుగా హెచ్చరించారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదని పేర్కొన్నారు. టోకెన్ల దందాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో రాజకీయాల్లోకి వచ్చిన రోజా అతడిపైనా నోరు పారేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ నాయకులపై అనేక రకాలుగా వేధించినా కాని అధికారంలోకి వచ్చిన తరువాత వారిని చంద్రబాబు వదిలేశారని స్పష్టం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా కడ్చలూరు బోటు ప్రమాదంలో 39 మంది చనిపోయారని, అన్నమయ్య ప్రాజెక్ట్ ఘటనలో 33 మంది, విశాఖ ఎల్జీమార్స్ దుర్ఘటనలో 13 మంది , జంగారెడ్డి గూడెం కల్తీ కల్లు సేవించి 27 మంది, రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 12 మంది చిన్నారులు మృతి చెందారని ఆయన పేర్కొన్నారు. కృష్ణ జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన, కనిగిరి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం వైసీపీ హయాంలోనే జరిగాయని వివరించారు.