అమరావతి : వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజీనామా తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి (MP Gurumurthy) అన్నారు. రాజీనామా ప్రకటన అనంతరం శనివారం ఢిల్లీలో విజయసాయి రెడ్డిని కలిసేందుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వైఎస్‌కు నమ్మినబంటు విజయసాయి రెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో వ్యక్తిగతంగా తెలుసుకోవడానికే వచ్చానని వెల్లడించారు.
రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజీనామా ఉపసంహరణను వెనక్కి తీసుకోబోనని, పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తనకు సహకరించినందుకు ఎంపీ గురుమూర్తికి విజయసాయి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరి భేటీ అనంతరం విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ వద్దకు వెళ్లి స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా పత్రాన్ని అందజేశారు.