విజయవాడ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో అన్ని వర్గాల ప్రజలకు మేలే జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావ్ కరాడే చెప్పారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుగుతున్న సమయంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న బడ్జెట్‌ను తీసుకొచ్చామన్నారు. బడ్జెట్‌పై అవగాహన కల్పించేందుకు కరాడే ఆదివారం ఉదయం విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు జరిపామని కరాడే వెల్లడించారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎమ్మెస్ఎంఈ పథకానికి రూ.4.5 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా ఆత్మ నిర్బర్ భారత్ కింద రూ. 2.28 కోట్లు ఇచ్చామని, హోటల్స్, రెస్టారెంట్ల ఏర్పాటుకు లోన్ల సౌకర్యం, వ్యవసాయ ప్రాధాన్యతతో పాటు చిన్న తరహా ప్రొడక్టు లింక్ ఇన్సెంటివ్ స్కీం. వైద్య శాలలు ఏర్పాటు ద్వారా 60 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు.
ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద రూ.19,500 కోట్లు బడ్జెట్లో కేటాయించామని మంత్రి కరాడే చెప్పారు. గతి శక్తి వల్ల పారిశ్రామిక అభివృధ్ధితో ఉద్యోగాలు పెరుగుతాయని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు, రైల్వే, పోర్ట్, లాజిస్టిక్స్, ఎయిర్ పోర్ట్ వంటి ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొందరు పసలేని విమర్శలు చేస్తున్నారని, నాలుగైదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రూపొందించలేదన్నారు.