శ్రీకాకుళం: రణస్థలం మండలం పరిధిలోని కొవ్వాడ గ్రామంలో ప్రతిపాదిత అణువిద్యుత్ కేంద్రం (ఎన్పీపీ) ఉత్తర కోస్తా జిల్లాల ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని సీపీఎం అభిప్రాయపడుతున్నది. అందుకని తక్షణమే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం జిల్లా కార్యదర్శి డీ గోవిందరావు మీడియాతో మాట్లాడుతూ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ.. ఈ ప్రాజెక్టుతో నిర్వాసితులకు ఇబ్బందులు తప్పవన్నారు. ఈ ప్రాంతం భూకంపాలకు గురవుతున్నందున ఎన్పీపీ ఏర్పాటుకు అనువైంది కాదన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలన్నీ అణువిద్యుత్ కేంద్రాలను మూసివేశాయని గోవిందరావు గుర్తుచేశారు. అణు విద్యుత్ కేంద్రాలు ప్రజల భద్రతకు చాలా ప్రమాదకరమని పేర్కొన్న ఆయన.. దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సరైన సాంకేతికత లేనప్పటికీ ప్లాంట్ ఏర్పాటుపై భారత ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపుతుందో అర్థం కావడం లేదన్నారు. ప్లాంట్ పూర్తయిన తర్వాత ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే.. ఒడిశాలోని చత్రాపూర్ నుంచి విశాఖపట్నం వరకున్న ప్రజలు ప్రభావితమవుతారని చెప్పారు. ఇది ఆ ప్రాంతంలో కాలుష్య స్థాయిలను కూడా పెంచుతుందని తెలిపారు.
ప్రతిపాదిత అణు విద్యుత్ కేంద్రాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై సీపీఎం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నదని గోవిందరావు చెప్పారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ చర్యకు వ్యతిరేకంగా మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఐక్యంగా పోరాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలను కాదని ఎన్పీపీని కొవ్వాడలో ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించుకుంటే.. జరిగే పరిణామాలకు కేంద్రంలోని బీజేపీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు జీ సింహాచలం, కే నాగమణి, పీ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.