అమరావతి : గ్రామ వాలంటీర్లను (Volunteers) జగన్ ప్రభుత్వం మోసం చేసి ఉద్యోగంలో పెట్టుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సర్పంచుల సంఘాల ప్రతినిధులతో పవన్‌కల్యాణ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో పవన్ మాట్లాడుతూ ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా గ్రామ వాలంటీర్ల అంశమే లేదని, అసలు ఉద్యోగాల్లోనే లేరంటే రద్దు అనే అంశం ఎక్కడుందని ప్రశ్నించారు.
వైసీపీ జగన్ (YS Jagan) పాలనలో గ్రామ పంచాయతీ నిధులను(Panchayat Funds) దారి మళ్లించారని , రాష్ట్రంలోని 12,900 పంచాయతీల్లో నిధులను గత ప్రభుత్వం వాడేసుకుందని పేర్కొన్నారు. ఇతర అవసరాలకు రూ. 8,629 కోట్లు మళ్లించారని విమర్శించారు. మరో నెలలో రూ. 750 కోట్లు పంచాయతీల ఖాతాలకే రాబోతున్నాయని వెల్లడించారు.
ఇప్పటికే సర్పంచుల డిమాండ్లలో కీలకమైనవి గుర్తించి పూర్తి చేశామని అన్నారు. కేరళ అధికారి కృష్ణతేజను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి ఆయన సహకారంతోనే గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేశామని వివరించారు. ఎంపీ నిధుల ద్వారా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పెండింగ్ నిధులు కూడా విడుదలకు కేబినెట్లో నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని, వాటిని సరిచేయడానికి చంద్రబాబు అనుభవం కీలకంగా మారిందన్నారు .