అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) దగ్గరి బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ( Balineni Srinivas reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు . వైసీపీలో పడ్డ బాధలను, అవమానాలు తట్టుకోలేక ఏడ్చిన రోజులున్నాయని పేర్కొన్నారు. నిన్న వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ను గురువారం కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గతంలో వైసీపీ (YCP) తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడలేదని, జగన్‌ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నానని తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబం కదా అని ఇన్ని రోజులు భరించానని అన్నారు. ప్రజా సమస్యలు చెబితే జగన్‌కు నచ్చేది కాదని ఆరోపించారు. జగన్‌ను బ్లాక్మెయిల్ చేసినట్లు వస్తున్న వార్తాలను ఖండించారు.
ఇటీవల జరిగినా ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా గాని జగన్ పద్ధతి మార్చుకోలేదని విమర్శించారు. త్వరలో స్వచ్ఛందంగా జనసేనలో చేరుతున్నానని, పదవులు ఆశించి కాదని వెల్లడించారు. పవన్ ఆదేశాల మేరకు నడుచుకుంటాను. తనకు పదవులు ముఖ్యం కాదు. గౌరవం కావాలని, అందరిని కలుపుకుని జనసేన అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.