అమరావతి : తిరుపతి (Tirupati) తొక్కిసలాట ఘటనపై మాజీ మంత్రి రోజా (Ex-minister Roja) కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంవల్లే ఆరుగురు చనిపోయారని, ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని విమర్శించారు. వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు, పాలకమండలి తమ పదవులకు రాజీనామాలు చేయాలని, వారిపై క్రిమినల్ కేసులు (Criminal Cases) నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు . వైకుంఠ ద్వారా దర్శనం సమయంలో ఇలాంటి దురదృష్ట ఘటనలు జరిగిన దాఖాలాలు లేవని అన్నారు. చంద్రబాబు టీటీడీ చైర్మన్‌గా అసమర్దుడిని పెట్టారని ఆరోపించారు. లక్షలాధి మంది వచ్చే దేవస్థానంలో భద్రతపై చిత్తశుద్ధిలేని వ్యక్తిని ఎస్పీగా పెట్టారని ఆరోపించారు. వీరంతా చంద్రబాబుకు ఊడిగం చేసేందుకే పనిచేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు (Chandrababu) అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాట 29 మంది చనిపోయారని, ఇటీవల విజయవాడలో వరదలు 60 మంది చనిపోయారని విమర్శించారు.
సనాతన యోధుడు స్పందించాలి
సనాతన యోధుడని గొప్పగా చెప్పుకున్న పవన్‌కల్యాణ్ ఘటనపై ఎలాంటి ప్రాయచ్చితం చేస్తారో తెలుపాలని కోరారు. కూటమి పాలనలో నిర్లక్ష్యం జరిగినందున అందరు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పుష్ప సినిమా బెనిఫిట్ షోలో తొక్కిసలాట జరిగితే హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లుగానే తిరుపతి ఘటనపై చంద్రబాబు , టీటీడీ పాలక మండలి, అధికారులను బాధ్యులు చేస్తూ క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై పీఠాధిపతులు సైతం స్పందించి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ప్రభుత్వ నిర్లక్షాన్ని ఎండగట్టాలని కోరారు. బీజేపీ నాయకులకు నిజంగా భక్తి మీద శ్రద్ధ ఉంటే తిరుపతి ఘటనపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసి, విచారణకు ఆదేశించాలని కోరాలని సూచించారు. గత వైసీపీ హయాంలో ఏనాడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. క్యూలైన్లో భక్తులకుపాలు, వృద్ధులకు షెల్టర్లు కల్పించామని పేర్కొన్నారు.