EVM | ఈవీఎంలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు వీటిపై సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్‌నే వాడాలని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలెట్‌నే వాడుతున్నారని తెలిపారు. భారత్‌లోనూ బ్యాలెట్ పేపర్‌నే వాడాలని సూచించారు. న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదని.. అది జరిగినట్టు కూడా కనిపించాలని అన్నారు. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్టు కనిపించాలని అన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్టు చేశారు.
ఈవీఎంలపై వైఎస్ జగన్ అనుమానాలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ఆయనకు ఒక సవాలు విసిరారు. దమ్ముంటే పులివెందులలో రాజీనామా చేయాలని అన్నారు. అప్పుడు బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళదామని సూచించారు. అప్పుడు మొన్న వచ్చిన మెజారిటీ అయిన జగన్‌కు వస్తుందా? లేదా అని సవాలు విసిరారు. అసలు జగన్ గెలుస్తారో లేదో చూద్దామని అన్నారు. గత ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లు వస్తే అది విజయం.. అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా అని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ చిలక జోస్యం చెప్పడం మానుకోవాలని విమర్శించారు.
జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఎలన్ మస్క్‌లా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా అని విమర్శించారు. 2019లో జగన్ గెలిచినప్పుడు ఈవీఎంలపై ఏం మాట్లాడారో జగన్ గుర్తు చేసుకోవాలన్నారు. పరనింద, ఆత్మస్తుతి మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.