JC Prabhakar Reddy | మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కేతిరెడ్డిని తాడిపత్రి, అనంతపురం నుంచి కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే బహిష్కరించాలని కోరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతానని హెచ్చరించారు.
తాడిపత్రిలో తనకు శత్రువులు లేరని.. వైసీపీలో నలుగురు, ఐదుగురు ఉన్నారని తెలిపారు. వాళ్లపై చట్టపరంగానే చర్యలకు వెళ్తానని హెచ్చరించారు. తాడిపత్రిలో ఉండడానికి తనకు పోలీసుల పర్మిషన్ అవసరం లేదని తెలిపారు. నేనే పోలీసులకు సమాచారం ఇస్తా.. అప్పుడు రక్షణ కల్పించండి.. తాడిపత్రి అల్లర్ల కేసులో నన్ను అరెస్టు చేసుకోండి అని వ్యాఖ్యానించారు. కేతిరెడ్డి జీవితం మొత్తం గన్మెన్లతోనే సాగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పోలింగ్ రోజు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తమ కార్యకర్త సూర్యముని ఇంటిపై దాడి చేశారని తెలిపారు.
ఇక తన ట్రావెల్స్, తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డీటీసీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. దీనిపై ఈ నెల 24వ తేదీన అనంతపురం వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయబోతున్నానని తెలిపారు. పేర్ని నాని, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, డీటీసీలపై ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు తాను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కదలబోను అని స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన ఎస్పీ తమను ఇబ్బందులు పెట్టిన కేసులపై కూడా విచారణ జరిపించాలని కోరారు.