Buddha Venkanna | ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తప్పుబట్టారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానని తెలిపారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నాలుక కోసుకుంటారా? అని ఆరా మస్తాన్‌కు సవాలు విసిరారు. తన సవాలును స్వీకరించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.
క్రిమినల్ ఆలోచనలతో జగన్ ఫేక్ సర్వే చేయించాడని బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అసెంబ్లీలో అడుగుపెట్టనని చెప్పే దమ్ము ధైర్యం జగన్‌కు ఉందా అని నిలదీశారు. సర్వేల్లో మెజార్టీ సంస్థలు కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పాయి. ఒక్క ఆరా మస్తాన్ సర్వేనే ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఓటమి తప్పదనే నిరాశలో వైసీపీ క్యాడర్ ఉందని.. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఆరా సర్వే చేయించారని విమర్శించారు. అది ఫేక్ సర్వే అని వైసీపీ ముఖ్య నేతలకు తెలుసని ఎద్దేవా చేశారు.