ఒంగోలు: తమిళనాడు పావురాలు ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి కలకలం సృష్టించాయి. చెన్నై నుంచి చిన్న కొత్తపల్లి మీదుగా బెట్టింగ్ పావురాల దందా కొనసాగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాలుగు లారీల్లో పావురాలను తీసుకొచ్చిన బెట్టింగ్ నిర్వాహకులు.. బెట్టింగ్ నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో పావురాలను వదిలారు. విషయం తెలుసుకు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పావురాల బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇటీవల ఏపీలోని ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో కాళ్లకు ట్యాగ్‌లతో వచ్చిన పావురాలు కలకలం రేపాయి. ప్రకాశం జిల్లాలో పావురాలకు దాణా వేసే ఒక వ్యక్తి పలు పావురాల కాళ్లకు చైనా భాషలో ఉన్న ట్యాగ్లు ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు ఆ పావురాలను పట్టుకుని విచారణ ప్రారంభించారు. ఇప్పుడు మరోసారి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్న కొత్తపల్లిలో ట్యాగ్లు ఉన్న వందలాది పావురాలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. దీంతో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. తమిళనాడు నుంచి నాలుగు లారీల్లో పావురాలను తీసుకొచ్చిన పలువురు వ్యక్తులు.. ట్యాగ్లు కట్టిన వందలాది పావురాలను పంజరాల నుంచి విడిచిపెట్టారు.
ఈ పావురాలు చెన్నైకి చెందిన ఓ సంస్థకు చెందిన రేసింగ్ పావురాలుగా అనుమానిస్తున్నారు. అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి నుంచి వదిలిన పావురాల్లో ఏది ముందుగా చెన్నైలోని తమ స్థావరానికి చేరుకుంటుందో దానిని విజేతగా ప్రకటిస్తారని ప్రాథమిక సమాచారం. పావురాలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాత వాటిని ఇక్కడికి తీసుకొచ్చి గాల్లోకి వదిలి వాటిపై బెట్టింగ్ కాస్తుంటారు. గత వారం కూడా ఇలాగే పావురాలను వదిలిన విషయం తెల్సుకున్న స్థానిక పోలీసులు వీరిపై నిఘా పెట్టారు. సోమవారం బెట్టింగ్‌కు పావురాలను తెచ్చారనే సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై, చెన్నకొత్తపల్లి మధ్య ఉన్న లింకులపై పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు.