(Sweet Recognition) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు మిఠాయిలకు తీపి కబురు అందింది. కాకినాడ కాజా, మాడుగుల హల్వాలకు అరుదైన గుర్తింపు లభించింది. కాకినాడ కాజాను భావితరాలు గుర్తుంచుకునేందుకు వీలుగా పోస్టల్ శాఖ ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. మాడుగుల హల్వా విశిష్టతను పోస్టల్ కవర్ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పేందుకు తపాలా శాఖ సిద్ధమైంది.
తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో తయారయ్యే కాజాలకు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేక ఆదరణ కలిగిఉన్నది. ఈ కాజాకు వందకు పైగా సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు చెప్తుంటారు. 1891 లో కోటయ్య అనే వ్యక్తి ఈ మిఠాయిని తయారు చేసినట్లుగా స్థానికులు చెప్తుంటారు. కాగా, ఈ మిఠాయికి 2018 లో జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించడంతో అంతర్జాతీయంగా ప్రచారం లభించినట్లయింది.
ఇక మాడుగుల హల్వాది మరో ప్రత్యేకత. ఎన్నో హల్వాలు మార్కెట్లో దొరుకుతున్నప్పటికీ.. దేశ, విదేశాల నుంచి విశాఖకు వచ్చే వారు మాడుగుల హల్వా రుచి చూడందే వెళ్లరంటే అతిశయోక్తి కాదు. ఈ హల్వాను 1890 లో మాడుగులకు చెందిన దంగేటి ధర్మారావు అనే వ్యాపారి తొలిసారి తయారుచేసినట్లుగా చెప్తుంటారు. ఈ హల్వాను తినడం వల్ల లైంగిక సామర్ధ్యం పెరుగుతుందనే నమ్మకం చాలా మందిలో ఉండటంతో ఈ హల్వాకు అంతర్జాతీయ ప్రచారం లభించింది. దీని కారణంగానే మాడుగుల పర్యాటక ప్రాంతంగా తయారైందని చెప్పవచ్చు. ఈ రెండు మిఠాయిల క్రేజ్ ఇవాల్టికి కూడా ఏమాత్రం తగ్గలేదు. వీటిని భావి తరాలకు అందించేందుకు తపాలా శాఖ అరుదైన రీతిలో గుర్తింపునివ్వడం సంతోషదాయకం.