అమరావతి : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ( Vijayasai reddy) ఏపీ ప్రభుత్వ పాలకులపై ట్విట్టర్ వేదిక ద్వారాఆరోపణల పరంపరను వేగవంతం చేశారు. ఆంధ్రయూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్(Raging ) రక్కసి మళ్లీ పురుడు పోసుకుందని మంగళవారం మరోసారి ట్విట్టర్(Twitter) లో ఆరోపించారు. ర్యాగింగ్‌లో టీడీపీ నాయకుల కుమారులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు.
హాస్టల్ రూమ్స్ లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టారని ఆయన ఆరోపించారు. మాకు డ్యాన్స్ రాదని చెబితే.. అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు.
స్పందించిన కాలేజీ యాజమాన్యం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసిందని వెల్లడించారు. బాధిత విద్యార్ధినిల తల్లిదండ్రుల మనోవేదన అర్థం చేసుకోవాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం నిద్రపోతుందా? అంటూ ప్రశ్నించారు. ఇదివరకు ఉన్న వైస్ చాన్స్‌లర్ , ఇక్కడే కదా కుల సభలు, రూల్స్ కి వ్యతిరేకంగా రాజకీయ సభలు నిర్వహించిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపల్‌కు , వైస్‌చాన్స్‌లర్‌కు ఫిర్యాదు చేయాలని విద్యార్థిని తల్లిదండ్రులకు ఆయన సూచించారు.