అమరావతి : మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను తామే అరెస్టు చేసినట్లు భారత ప్రభుత్వ జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ ) అధికారులు వెల్లడించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో నివాసంలో ఉన్న ఆర్కే భార్య శిరీష ఇంటిపై మఫ్టీలో ఉన్న పోలీసులు దాడులు చేసి ఆమెను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు.
ఆర్కే డైరీ ఆధారంగానే ఆమెను అరెస్టు చేశామంటూ శనివారం ఎన్ఐఏ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను అరెస్టు చేశామని వెల్లడించారు. వీరిద్దరూ మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. మావోయిస్టుల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్లు గుర్తించామని , వీరు 2019లో తిరియా ఎన్కౌంటర్లో పాల్గొన్నారని వివరించారు. మావోయిస్టుల కోసం కొత్త రిక్రూట్మెంట్లు కూడా చేస్తున్నట్లు గుర్తించామని వారు తెలిపారు.