అమరావతి: ఆంధ్రప్రదేశ్ 1998 డీఎస్సీలో సంచలనం నమోదైంది. ఆ బ్యాచ్ అభ్యర్థులకు జగన్ సర్కార్ లైన్ క్లియర్ చేసింది. కోర్టు వివాదాలు సమసిపోవడంతో వారిని ఉపాధ్యాయులుగా నియమించేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, 24 ఏండ్ల తర్వాత డీఎస్సీ అభ్యర్థుల జాబితాకు మోక్షం రావడంతో సంచలనాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఉపాధ్యాయుడిగా నియమితులు కానున్న ఒకరు నిత్యం కూలీ చేసుకుని జీవించే వ్యక్తిగా.. మరొకరు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్లికి చెందిన బీ నాగరాజు 1990 లో బీఈడీ చదివారు. 1994, 97 డీఎస్సీ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఉద్యోగం మాత్రం రాలేదు. చివరకు 1998 డీఎస్సీలో ర్యాంకు సాధించినా.. దురదృష్టం వెంటాడింది. ఆ డీఎస్సీ కోర్టుకెక్కింది. వివాదం సద్దుమణిగేందుకు 24 ఏండ్లు పట్టింది. ఇప్పుడు నాగరాజుకు 55 ఏండ్లు. భార్య స్వగ్రామానికి వలస వెళ్లి కూలీ చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. ఇన్నేండ్లకైనా టీచర్ ఉద్యోగం వచ్చిందని, అయితే, ఐదేండ్ల సర్వీసుకే రిటైర్ కావాల్సి రావడం దురదృష్టకరమని నిట్టూరుస్తున్నాడు నాగరాజు.
ఇదిలాఉండగా, 1998 డీఎస్సీ జాబితాకు మోక్షం లభించడంతో చోడవరం ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కూడా సంతోషపడుతున్నాడు. అయితే, ఆయన ఇప్పుడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. 1998 డీఎస్సీలో ర్యాంకు సాధించి ఉద్యోగం తప్పక వస్తుందని ఆశించి.. వివాదం కోర్టుకెక్కడంతో మిన్నకుండిపోయాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో చేరి క్రియాశీలకంగా పనిచేశాడు. వైఎస్సార్ అనుచరుడిగా కొనసాగి అనంతరకాలంలో వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా సముచిత స్థానంలో ఉన్నానని, అయితే అప్పుడే డీఎస్సీ జాబితా వచ్చి ఉంటే టీచర్‌గా సేవలందించేవాడిని అని సంతోషంగా చెప్తున్నారు కరణం ధర్మశ్రీ.