అమరావతి : విజయవాడ ప్రజలను భయాందోళనకు గురిచేసిన ప్రకావం బ్యారేజీ (Prakasam barrage ) వద్ద కొట్టుకు వచ్చిన బోట్ల(Boats) తొలగింపు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. గురువారం మరో బోటును నీటి అడుగుబాగాన నుంచి తీసి ఒడ్డుకు చేర్చడంలో బెకెం ఇన్ఫ్రా ఇంజినీర్లు (Bekem Infra engineers) సఫలికృతమయ్యారు.
గత పదిరోజులుగా బోట్ల తొలగింపులో అనేక అవస్థలు పడ్డ అధికారులు, ఇంజినీర్లు మరో ప్రయత్నంగా ఇనుపగడ్డర్లతో రెండు పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవను వెలికితీశారు. నీటమునిగిన పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజీ ఎగువ ఉన్న పున్నమి ఘాట్ వద్దకు తరలించారు. బ్యారేజీ వద్ద ఇంకా బోల్తా పడి ఉన్న మూడో బోటును రేపు బయటకు తీసి ఒడ్డుకు తరలించే యత్నాన్ని చేయనున్నారు.
నిన్న ఒక బోటును తీసిన నిపుణులు, రెండో బోటును నిన్నటి ప్రయత్నంతోనే బయటకు తీశారు. ఈనెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ గేట్లవద్దే చిక్కుకున్నాయి. ఈ బోట్లు బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో భారీ పడవలను తొలగించేందుకు పలు ప్లాన్ అమలు చేసిన అధికారులు, తాజాగా సఫలీకృతం అయ్యారు.