అమరావతి: దరిదాపుల్లో ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వెడెక్కాయి. ఒకరిపై ఒకరు వాగ్బాణాలు విసురుకోవడం, ఒకరిని మరొకరు తూలనాడటం జరుగుతున్నది. అంతకు మించి పొత్తుల లెక్కలు ముందుకు వచ్చాయి. దాంతో ఎప్పుడో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయం ఇప్పటి నుంచే రసవత్తరంగా సాగుతున్నది.
మరో రెండేండ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఏపీలో రాజకీయ పార్టీలు అప్పడే సిద్ధమవుతున్నాయి. ఎవరు మిత్రపక్షమో, ఎవరితో పొత్తు పెట్టుకోవాలో.. ఎవరిని ఎలా దగ్గరికి తీసుకోవాలో.. అనే విషయాలపై రసవత్తరమైన చర్చ సాగుతున్నది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన పార్టీ నేతలు తహతహలాడుతున్నారని, టీడీపీతో పొత్తుతో పవన్ కల్యాణ్ ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరని బాలినేని అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ఈసారి కాకున్నా మరోసారైనా అవకాశం ఉంటుందన్నారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీని పవన్ కల్యాణ్ అడుక్కుంటున్నా.. వారు మాత్రం పట్టించుకోవడం లేదని బాలినేని చెప్పారు.
ఎన్నికల్లో ప్రజలను తమ వైపు తిప్పుకునే పార్టీల మాదిరిగా వైసీపీ లేదని బాలినేని చెప్పారు. తాము తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు చేరవేసేందుకు గడప గడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తున్నామని, వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రజలంతా వైసీపీ వెంటే ఉన్నారని, దీనికి నిదర్శనం ఇటీవలి వరకు జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడమే అన్నారు.