ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన కారుపై నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తుండగా.. ఒక్కసారి వెనక వైపు నుంచి కారెక్కిన ఓ అభిమాని అత్యుత్సాహంతో పవన్ కల్యాణ్ పడిపోయాడు. అయితే, కారు టాప్‌పైనే పడిపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. పవన్ కల్యాణ్‌కు ప్రమాదం తప్పడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. రెండేండ్ల క్రితం కూడా ఇలాగే విజయనగరం అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన స్టేజీపైనే అభిమాని అత్యుత్సాహంతో పవన్ కల్యాణ్ కిందపడిపోయారు.
నరసాపురంలో బహిరంగసభ నిర్వహించేందుకు పవన్ కల్యాణ్ వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. తన అభిమాన నటుడ్ని కలవాలన్న తపనతో ఓ అభిమాని ఆయన కారెక్కాడు. వెనక నుంచి పట్టుకునే ప్రయత్నం చేయగా బ్యాలెన్స్ తప్పిపోయింది. దాంతో పవన్ కల్యాణ్, అభిమాని ఇద్దరూ పడిపోయారు. అయితే, పవన్ కల్యాణ్ కారు టాప్‌పై పడగా.. అభిమాని కిందపడిపోయాడు. ఈ ఘటనలో పవన్ కల్యాణ్ కారుపైనుంచి కిందపడకుండా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.
అనంతరం లేచిన పవన్ కల్యాణ్ తన వాహనాన్ని బహిరంగసభ వైపు తీసుకెళ్లమని తన సిబ్బందికి ఆదేశించారు. ఈ ఘటనతో పవన్ కల్యాణ్ సెక్యూరిటీ ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతున్నదని జనసేన శ్రేణులు పెదవి విరుస్తున్నారు. అభిమానులు, జనసేన కార్యకర్తలను స్థానిక పోలీసులు ఏ మాత్రం అడ్డగించే ప్రయత్నం చేయకుండా మిన్నకుండిపోవడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు.