Pawan Kalyan | అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తామని ప్రజలు విశ్వసిస్తే, అనుకూల సర్వేలు వస్తే జనసేన ఒంటరిగా పోటీ చేసి గెలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళవారం మచిలీపట్నంలో జరిగిన జనసేన పదో ఆవిర్భావ సభలో మాట్లాడుతూ నేరుగా పొత్తుల సంగతి బయట పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని, ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ తొలి నుంచి ప్రతిపాదిస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేయాలని కోరుతున్నారు. కానీ, టీడీపీతో కలిసి పని చేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. టీడీపీ సైతం బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నది. కానీ బీజేపీ ససేమిరా అంటున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
వచ్చే ఎన్నికల్లో జనసేన బలి పశువు కాబోదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీతో సీట్ల సర్దుబాటు జరుగలేదన్నారు. తాను భారతీయుడ్ని. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తోపాటు పోటీచేసిన ప్రతి ఒక్కరు అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నానని చెప్పారు.
తాను వ్యక్తిగతంగా నష్టపోయినా, ప్రజలకు అండగా నిలబడతా అని పవన్ కల్యాణ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడండి అని కేంద్రాన్ని కోరానని చెప్పారు. పొత్తులో ఉండి కూడా.. ప్రజా ప్రతినిధులు లేకపోయినా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని కోరానని చెప్పారు. జిందాల్‌కు మైన్స్ అప్పగించినట్లు విశాఖ స్టీల్‌కు మైన్స్ అప్పగించాలని కోరకుంటే నష్టపోతాం అని పవన్ కల్యాణ్ చెప్పారు. విశాఖ స్టీల్ పరిరక్షణ ఉద్యమం చేస్తే నీరు గార్చడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని అందలం ఎక్కించడానికి తాను లేనని చెప్పారు. వాట్సాప్‌లో వచ్చే ప్రతి మెసేజ్‌ను నమ్మితే ఎలా అని ప్రశ్నించారు. తన నిజాయితీని శంకించవద్దని అన్నారు.