కాకినాడ: మూలామ్నాయ కంచి కామకోటి పీఠం పీఠాధిపతి జగద్గురువు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో రేపటి నుంచి ‘పంచాంగం సదస్సు’ ప్రారంభం కానున్నది. ఈ సదస్సు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సదస్సులో పంచాంగ రచయితలు 2023-24 శోభకృత తెలుగు సంవత్సరానికి సంబంధించిన పండుగలు, చంద్ర, సూర్య గ్రహణాలు, ముహూర్తాల తేదీలను నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమం కాకినాడ తిమ్మాపురంలోని ఆకొండి లక్ష్మీ స్మారక గోశాలలో చేపడుతున్నారు.
తమిళనాడులోని కంచి పీఠంలో ప్రతి ఏటా హిందూ ధర్మానికి సంబంధించిన వివిధ పాండిత్య చర్చలు నిర్వహిస్తుంటారు. చాతుర్మాస్య దీక్షలో భాగంగా ‘అగ్ని హోత్ర సదస్సు’ కూడా చేపడతారు. ఈ సారి కాకినాడలోని ఆకొండి గోశాలలో కంచి కామకోటి పీఠం వార్షిక పంచాగం సదస్సు నిర్వహిస్తున్నట్లు పంచాంగ మహా సభ కార్యక్రమ అధ్యక్షుడు సుందరరామ వాజపేయి తెలిపారు. రానున్న తెలుగు క్యాలెండర్ ఇయర్‌కు సంబంధించి పంచాంగం వివరాలను ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు. గత 160 ఏండ్లుగా కంచి పీఠం ఆధ్వర్యంలో పంచాగ సదస్సులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. శ్రీలంక, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి 65 మంది పంచాంగ కర్తలు, ధర్మశాస్త్ర, ఆగమ పండితులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని వాజపేయి తెలిపారు.