(Palm leaf Digitization) విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న తాళపత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. యూనివర్శిటీ పరిధిలోని వీఎస్ కృష్ణా గ్రంథాలయంలో డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ ప్రసాద్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తాళపత్రాల్లో ఉన్న కథలు, కవితలు, శాస్త్రాలు, పురాణాలను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో డిజిటలైజేషన్ ప్రక్రియ నిర్ణయం తీసుకున్నారు. తాళపత్రాలను డిజిటల్ ఫార్మాట్లో అందుబాటులో ఉంచడానికే ఈ కసరత్తు చేపట్టినట్లు వైస్ ఛాన్స్లర్ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇది యువ పరిశోధకులకు శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని వీసీ అన్నారు.
తొలినాళ్లలో తాళపత్రాలపై కథలు, పద్యాలు, శాస్త్రాలు, పురాణాలు మొదలైనవి వ్రాసి భధ్రపరిచారు. తాళపత్ర గ్రంథాలలో అపూర్వమైన జ్ఞాన సంపద ఉన్నది. ఈ తాళపత్ర గ్రంథాలు భారతదేశానికి విలువైన జాతీయ సంపద అని పండితులు చెప్తుంటారు. ఆంధ్రా యూనివర్శిటీలో కూడా వేల సంఖ్యలో తాళపత్ర పుస్తకాలు ఉన్నాయి. వీఎస్ కృష్ణ లైబ్రరీలో అనేక రంగాలకు సంబంధించిన 5 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఎన్నో విలువైన, అరుదైన తాళపత్ర రాత ప్రతులు కూడా ఉన్నాయి. వీటిని ప్రత్యేక విభాగంలో భద్రపరిచి పరిరక్షించడంతోపాటు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.