Kotamreddy Sridhar Reddy | బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తుదిశ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజలు, తన వెంట నడిచే కార్యకర్తల కోసం దేన్నయినా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కోటంరెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీషీటర్లు మాట్లాడుకుంటున్న ఓ వీడియో శుక్రవారం నాడు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శనివారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి షాకయ్యానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అని రౌడీషీటర్లు మాట్లాడుకున్నారని.. ఈ వీడియోపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు మూడు రోజుల ముందే సమాచారం ఉన్నట్లు మీడియాలో వచ్చిందని ప్రస్తావించారు. ఎస్పీకి సమాచారం ఉన్నప్పుడు తనను ఎందుకు అలర్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కాదు.. ఒక పౌరుడిగా అడుగుతున్నానని.. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని వీడియోలో అన్నారు కదా.. ఆ డబ్బు ఎవరిస్తారు? పోలీసు విచారణలో అది తేలాలని అన్నారు.
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు వైసీపీ ఎందుకు స్పందించిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. తన తమ్ముడు గిరిధర్ రెడ్డినే కుట్ర చేశారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాధికారం కోసం సొంతవాళ్లనే హతమార్చిన డీఎన్ఏ మీది.. మాది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఆనాడు రౌడీయిజం చేస్తుంటే విద్యార్థి నేతగా తరిమితరిమికొట్టానని గుర్తుచేశారు. రౌడీలకు, గూండాలకు భయపడే తత్వం తనది కాదని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేవాన్ని కాదని స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. నన్ను ధిక్కరిస్తే అణిచివేస్తానని అన్నందుకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నారని.. దీంతో 16 నెలల ముందే బయటకు వచ్చానని తెలిపారు. తనను, తన తమ్ముడిని బోరుగడ్డ అనిల్ బండికి కట్టేసి లాగుతా అన్నప్పుడే భయపడలేదని తెలిపారు. ఏదో ఒక రోజు మరణం తప్పదని.. చావు అంటే భయపడుతూ బతకడం మాకు తెలియదని చెప్పారు. తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నానని.. వైసీపీకి ప్రత్యర్థిగా ఉన్నానని.. తనను హత్య చేయాలని ఎవరు కుట్ర పన్నారు? ఎవరికి ప్రయోజనం అన్నది పోలీసులే తేల్చాలని చెప్పారు.