తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు తిరుమలలో వీరంగం సృష్టించాడు. తనకు రూం కేటాయించాలంటూ అక్కడ విధుల్లో ఉన్నవారిని దబాయించాడు. అడ్డదారిలో గది ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన ఓ టీటీడీ ఉద్యోగితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా ఆయనపై దాడి చేసి కొట్టాడు.
ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడుగా చెప్పుకుంటున్న బబ్లూ అనే యువకుడు తిరుమలలో హంగామా చేశాడు. తనకు గది ఇవ్వాలంటూ ఎంబీసీ కౌంటర్ వద్ద అక్కడి ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చాడు. అలా కుదరదని చెప్పిన టీటీడీకి చెందిన సీనియర్ అసిస్టెంట్ వెంకటరత్నంతో వాగ్వాదానికి దిగి చేయి చేసుకున్నాడు. తీవ్రగాయాలపాలైన వెంకటరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగిపై దాడిని టీటీడీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఖండించింది. అలాగే, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ వెంటనే స్పందించి వీరంగం సృష్టించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు పెరిగిపోతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు.