గుంటూరు: అనుమానాస్పద వ్యాధితో బాధపడుతున్న పల్నాడు ప్రాంతంలోని కొలకలూరు గ్రామాన్ని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని సందర్శించారు. కొలకలూరులో ఏర్పాటుచేసిన చికిత్స కేంద్రంలో బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. చనిపోయిన బాలిక శ్రీనిధి కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
తెనాలి మండలం పరిధిలోని కొలకలూరులో అనుమానిత గ్యాస్ట్రోఎంటెరిటిస్ అనే వ్యాధి లక్షణాలు చాలా మందిలో కనిపించాయి. మరికొందరిలో డయోరియా లక్షణాలు కనిపించాయి. ఇప్పటికే ఓ 14 ఏండ్ల బాలిక శ్రీనిధి ఈ వ్యాధి లక్షణాలతో చనిపోవడం కలకలం రేపింది. పలువురు గ్రామస్థులు తీవ్రంగా అస్వస్థతకు గురవడంతో .. గ్రామంలో 25 పడకలతో తాత్కాలిక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజిని.. ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. కొలకలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. డయేరియాతో బాధపడుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
పీహెచ్సీలో రోగులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం 30 మంది వైద్యులను ఇక్కడికి పంపిందని మంత్రి మీడియాకు గుర్తు చేశారు. డయేరియాతో బాధపడుతున్న రోగులను గుర్తించేందుకు ఏఎన్ఎంలు గ్రామంలో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. దవాఖానలో చేరిన 70 మంది రోగులలో 50 శాతం మంది డిశ్చార్జ్ అయ్యారని, తాజాగా ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మరో రెండు వారాల పాటు కొనసాగించాలని ఆమె అధికారులను ఆదేశించారు. అతిసార వ్యాధితో మృతి చెందిన శ్రీనిధి కుటుంబీకులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆమె వెంట కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జే నివాస్, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల రెడ్డి తదితరులు ఉన్నారు.