తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో (Tirumala) జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార ( Vaikuntha Dwara) , దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23న తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24న విడుదల చేయనున్నట్లు వివరించారు.
ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్చినట్లు వెల్లడించారు. ఈనెల 25న ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను, 26న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తామని వివరించారు. మార్పును గమనించి టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 65,299 మంది భక్తులు దర్శించుకోగా 20,297 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.75 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుతం భక్తులు కంపార్టుమెంట్ల ద్వారా కాకుండా నేరుగా దర్శనానికి క్యూలైన్లో నిలబడ్డారని వివరించారు.