అమరావతి : ఈనెల 13న ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల పోలింగ్ స్టేషన్లో ఈవీఎం యంత్రాలను (EVM machines) ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna reddy) , అతడి సోదరుడి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎమ్మెల్యేను ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే ఇంకా పోలీసులకు పట్టుబడ లేదని రెండు రాష్ట్రాల పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను, అనుచరులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనలో ఇప్పటికే పిన్నెల్లిని ఏ1గా ఎఫ్ఐఆర్(FIR) లో చేర్చారు. ఐపీలోని143, 147, 448, 427, 353, 452, 120బి, తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విధ్వంసానికి పాల్పడ్డ ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కమార్ మీనా సీరియస్ స్పష్టం చేశారు.
ఏపీలో మొత్తం 9 ఈవీఎంలు ధ్వంసం కాగా మాచర్లలోనే 7 ఈవీఎంలను ధ్వంసం చేశారని ఆయన వెల్లడించారు. ఈవీఎంలను ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందని, దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ను కొనసాగించామని తెలిపారు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని పేర్నొన్నారు.