అమరావతి : తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) చేసిన తీవ్ర ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy ) ఖండించారు. లడ్డూ తయారీలో పందితో నెయ్యిని ఉపయోగించారని నీచమైన ఆరోపణలు చేశారని, చంద్రబాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. వైసీపీ పార్టీని బదనాం చేయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాదని , తిరుమల పవిత్రను కాపాడుకోవడానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభవాలు దెబ్బతినకుండా ఉండడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వెల్లడించారు. అవసరమైతే ఆరోపణలు చేసిన వ్యక్తులపై పరువునష్టం దావా(Defamation suit) వేస్తానని హెచ్చరించారు.
రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఉమ్మడి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నందున తిరుమలపై చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణనైనా వేసుకోవాలని సూచించారు. నాలుగు సంవత్సరాల పాటు చైర్మన్గా పనిచేసిన సమయంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని శ్రీవారి పాదాల చెంత నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మీ ఆరోపణలకు కట్టుబడి ఉంటే చంద్రబాబు కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి 2024 వరకు మధ్య క్వాలిటీ చెక్ చేసి నాణ్యత లేదని పదిసార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపామని తెలిపారు.