Pawan Kalyan | కులాలకు మతాలకు అతీతంగా యువత అండగా నిలబడితే.. జనసేనకు అధికారం అప్పగిస్తే మీకు భరోసానిస్తా అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ సభ జరిగింది. ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. భవిష్యత్లో మతాలతో సంబంధం లేని రాజకీయాలు రావాలని కోరుతున్నానన్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున తన పార్టీతో కలిసి రాలేమని చెబుతున్న ముస్లిం సమాజానికి అండగా నిలిచేందుకు ముందు ఉంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలు వైసీపీ అధినేత, ఏపీసీఎం వైఎస్ జగన్ వెంట ఉన్నారని, ఆయన మరి ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. తాను బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నదని, మరి ఏపీ సీఎం వైఎస్ జగన్ బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో ఒక కులం పెత్తనం ఆగిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. అన్ని కులాల ఐక్యత సాగాలని, అది జనసేనతోనే సాధ్యం అని చెప్పారు. గతంలో వెనకబడినవారం అని చెప్పుకోవడం నామోషీగా ఫీలయ్యే వారని, ఇప్పుడు రిజర్వేషన్లు కావాలి కోరుతున్నారని అన్నారు. అగ్ర కులాల పేదల పిల్లలు ప్రతిభావంతులైనా.. మెరిట్ ర్యాంక్ వచ్చినా కోరుకున్న కోర్సుల్లో సీటు రాకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్రకులాల్లో వెనకబడిన వారికి ఏమైనా చేయాలంటే పలు అడ్డంకులు ఎదురవుతున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అగ్ర కులాల పేదల పిల్లలకు, యువతకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వారి కోర్సుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ మంజూరు చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. విదేశీ విద్యకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.