Naga Babu : మన హిందూ ధర్మం ప్రమాదంలో ఉందనడానికి లడ్డూ అంశం క్లైమాక్స్ లాంటిదని జనసేన పార్టీ జాతీయ కార్యదర్శి నాగబాబు అన్నారు. సనాతన ధర్మం బతకడం నేర్పించిందని, దానికి అన్యాయం జరుగుతోందనే విషయాన్నే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేవనెత్తారని ఆయన తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పవన్ కల్యాణ్ మాటలను పూర్తిగా సమర్థిస్తున్నా. హిందూ దేవాలయాలు, ధార్మిక మండళ్లు హిందువులే నిర్వహించాలి. ప్రభుత్వాల నిర్ణయాలు కోట్లాది మంది హిందువులపై ప్రభావం చూపుతున్నాయనేదే పవన్ కల్యాణ్ బాధ. అన్ని మతాలతో కలిసి ఉండే వ్యక్తి పవన్ కల్యాణ్. హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దోషులెవరున్నా బయటపడక తప్పదని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.