అమరావతి : చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసీపీ మాజీ మంత్రికి చేసిన ట్విట్ ఏపీలో రాజకీయం దుమారం రేపుతుంది. చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ విసిరిన చేనేత సవాలును మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్వీకరిస్తూ రీట్విట్ చేశారు. దీంతో బాలినేని పార్టీ మారుతున్నాడని ప్రచారం వస్తుండడంతో తీవ్రంగా ఖండించారు. తాను జనసేన పార్టీతో టచ్‌లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్షతో ఎమ్మెల్యేను అయ్యానని, వైఎస్సార్సీపీ వీడేది లేదని, రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే నడుస్తానని వెల్లడించారు. జగన్ తనకు అప్పగించిన పనిని నెరవేర్చడంలో నిమగ్నమయ్యాయని, పారీ సమన్వయం కోసం కష్టపడుతున్నానని తెలిపారు. ఇటీవల గిద్దలూరులో వైసీపీ సమావేశం పెడితే జనసేనకోసమే సమావేశం పెట్టానని వక్రీకరించారని ఆరోపించారు.
చేనేతల కోసం గతంలో చాలా కార్యక్రమాలు చేశామని , గతంలో మాదిరిగానే ఇప్పుడూ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. తాను ఊసరవెళ్లి రాజకీయాలు చేయనని వెల్లడించారు. తనకు ఎన్ని కష్టాలున్నా జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కు రెస్పాండ్ అయ్యానన్నారు. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం జగన్ తో మాట్లాడుతానని బాలినేని పేర్కొన్నారు.