తిరుమల : ఆపద మొక్కులవాడు తిరుమల ( Tirumala ) వేంకటేశ్వరస్వామికి పలువురు భక్తులు భారీగా విరాళాలను ( Donations ) అందజేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Central Bank Of India ) వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు( SV Pranadana Trust) రూ.1.50 కోట్లు కార్పొరేట్ సామాజిక బాధ్యత ( CSR ) కింద విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆ సంస్థ జోనల్ హెడ్ కె ధారాసింగ్ నాయక్, రీజనల్ హెడ్ ఈ వెంకటేశ్వర్లు విరాళం చెక్కును అందజేశారు.
చెన్నైకు చెందిన సంస్థ రూ.50 లక్షలు విరాళం
చెన్నైకు చెందిన పొన్ ప్యూర్ కెమికల్ (Pon Pure Chemical ) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆదివారం వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించింది. అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ సీఎండీ ఎం.పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంపి సూర్యప్రకాశ్ విరాళం చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టులో భాగమైన శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ పథకానికి వినియోగించాలని దాత అదనపు ఈవోను కోరారు.