అమరావతి : టీడీపీకి చెందిన కార్యకర్త, రౌడీ షీటర్ దాడిలో సహానా(Sahana) అనే యువతి దారుణంగా హత్యకు గురయ్యిందని, ఈ చర్య అత్యంత దారుణమని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి (Former Minister Roja) ఆరోపించారు. ఇంకా ఎంత మంది ఆడబిడ్డలను బలి తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో రౌడీ షీటర్ (Rowdy sheeter) బరితెగించి హత్యకు పాల్పడడంపై ఆమె ట్విటర్(Twitter) వేదిక ద్వారా స్పందించారు.
ఈ హత్య ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని దుయ్యబట్టారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సహాన మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu), హోంమంత్రి అనిత హత్యకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దాడి అనంతరం మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన సహానకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి , హోంమంత్రి వెళ్లి వైద్యులను ఆదేశించకపోవడం అమానవీయమని పేర్కొన్నారు.
టీడీపీ నేతలు, రౌడీ షీటర్ల నుంచి మహిళల మాన, ప్రాణాలకు ముప్పు ఉందని, తక్షణమే సహానా ను హత్య చేసిన టీడీపీ రౌడీ షీటర్ నవీన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రియాలిటీ షో కి వెళ్లి వినోదం పొందిన సీఎం చంద్రబాబు ఇప్పుడు సహాన తల్లి కన్నీటికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. సహాన ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.