విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఒడిశాలో మావోయిస్టుల దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఒడిశాలోని నౌపడా జిల్లా పరిధిలోని బోడెన్ బ్లాక్లో మంగళవారం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున గాలింపునకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు కటాఫ్ ఏరియా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అనుమానితులను విచారిస్తూ కూంబింగ్ జరుపుతున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల కిందకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మావోయిస్టుల ఉనికి గతంలో చాలా ఎక్కువగా ఉండేది. సరిహద్దులోని ఒడిశాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరపడంతో ఆంధ్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి ముమ్మరంగా గాలింపు చర్యలు దిగారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే ప్రజాప్రతినిధులు తగు భద్రతా చర్యలు తీసుకోవాలని, పోలీసుల సూచనల మేరకు పర్యటనకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.