అమరావతి: అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన మినీ మహానాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు అనుచిత పదజాలంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన పార్టీ నాయకులను ముఖ్యమంత్రిపై పరుష పదజాలం ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఇలాంటి చవకబారు ఎత్తుగడలు ఇకనైనా మానుకోవాలని అమర్నాథ్ సూచించారు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, దురుద్దేశ పూర్వకంగా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని తెలిపారు. గతంలో టీడీపీకి మద్దతిచ్చిన బీసీలు ఇప్పుడు వైసీపీ వెంటే ఉండి సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వానికి ఎందుకు మద్దతిస్తున్నారో చంద్రబాబు ఆలోచించాలన్నారు.
రాష్ట్రంలో సీఎం జగన్ చేపడుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. 2019లో అధికార పార్టీ ఘనవిజయం సాధించిందని, ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో అది నిరూపితమైందన్నారు. భవిష్యత్లో జరిగే అన్ని రకాల ఎన్నికల్లో ఇదే పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తప్పుడు మాటలు వల్లె వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు టీడీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు.