Gold ATM | ఏటీఎంలో కరెన్సీ నోట్లు తీసుకున్నంత తేలిగ్గా డెబిట్ కార్డ్‌తో బంగారం కొనుక్కునే ‘గోల్డ్ ఏటీఎం’ రూపొందించాడు వినోద్ కుమార్. ఈ ఆంత్రప్రెన్యూర్ ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. వినోద్ పుట్టింది అనకాపల్లిలో. పెరిగింది బెంగళూరులో. కేరాఫ్ సింగపూర్.. వయా హైదరాబాద్! ఈ జర్నీ ఎన్ని మలుపులు తిరిగిందో అన్ని పేటెంట్లూ సాధించింది. ఆ ప్రయాణమంతా అతని మాటల్లోనే..
నాన్న ఉద్యోగం వల్ల నేను బెంగళూరులో చదివాను. ఏడో తరగతిలో కంప్యూటర్ పరిచయమైంది. వేసవి సెలవుల్లో వెబ్ డిజైనింగ్‌లో అడుగుపెట్టాను. ఎనిమిదో తరగతి నాటికి సొంతంగా వెబ్ డిజైనింగ్ వచ్చింది. బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (ఎలక్ట్రానిక్స్)లో చేరాను. ఇంజినీరింగ్ చదువుతూనే రెండు చేతులా సంపాదించేవాణ్ని. ఫ్రీలాన్స్ వెబ్‌డెవలపర్‌గా పనిచేసేవాణ్ని. స్టూడెంట్స్ ప్రాజెక్టుల్లో పొరుగు కాలేజీ వాళ్లకూ సాయపడ్డాను. ప్రాజెక్టుకు 15 నుంచి 30 వేల దాకా ఇచ్చేవాళ్లు.
థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆరు పెద్ద కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. దేనికీ పోలేదు. ‘క్వెస్ట్’ అనే ఆర్ అండ్ డీ కంపెనీ వాళ్లు ‘అమెరికా తీసుకుపోతాం. డబ్బులిచ్చి చదివిస్తాం. జూనియర్ సైంటిస్ట్ జాబ్ ఇస్తాం’ అన్నారు. జాబ్ కోసం అమెరికా పోవాలా? ఇక్కడే హాయిగా చేసుకోవచ్చుగా అనుకున్నా. థర్డ్ ఇయర్ చదువుతూనే భారతీ ఎయిర్‌టెల్‌లో ఛానెల్ పార్టనర్‌గా చేరాను. ముప్పై మందికి టీమ్ లీడర్ని. వాళ్లంతా ఎంబీఏ చేశారు. నేను మాత్రం ఎంబీయే కాదు కదా, బీటెక్ కూడా పూర్తిచేయలేదు. ప్రాక్టికల్స్‌లో అన్ని సబ్జెక్టుల్లో వందశాతం మార్కులు వచ్చినా, థియరీలో అత్తెసరు మార్కులతో బయటపడ్డాను. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆంత్రప్రెన్యూర్‌షిప్ కోర్సు చేశాను. అందులో సిల్వర్ మెడల్ వచ్చింది. ఎల్ఐసీలో కొంతకాలం మేనేజర్‌గానూ పనిచేశాను.
బిజినెస్ చేయాలన్నదే నా కోరిక. ఎటు అవకాశం ఉంటే అటు వెళ్లాలని ఉండేది. హార్డ్‌వేర్ సైప్లె చేసేప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద ఆసక్తి వచ్చింది. ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించాను. బధిరుల కోసం పర్సనల్ సౌండ్ బాక్స్ తయారు చేశాను. అంతకుముందు ఇలాంటి టెక్నాలజీ ఎక్కడా లేదు. దానికి పేటెంట్ వచ్చింది. సన్మానాలు, అభినందనలు వెల్లువెత్తాయి. సంతృప్తి తప్ప డబ్బు రాలేదు. ఈ నష్టాన్ని పూడ్చేలా పక్కా కమర్షియల్ ప్రాజెక్ట్ చేద్దామనుకున్నాను. సినిమాలకు పైరసీ పెద్ద సమస్య. దీన్ని కంట్రోల్ చేసే వ్యవస్థలు లేవు. తెరమీద కనిపించే బొమ్మ కెమెరాలో రికార్డు కాకుండా పైరసీ సెక్యూర్డ్ బోర్డ్ (పీఎస్బీ)ను తయారు చేయడం మొదలుపెట్టాను. ఏడేళ్ల తర్వాత సక్సెస్ అయ్యాను. పేటెంట్ వచ్చింది. మేం తయారు చేసిన పీఎస్బీను తెర వెనుక అమర్చితే దానినుంచి ఇన్ఫ్రా రెడ్ కిరణాలు విడుదలవుతాయి. ఇవి ఉండటం వల్ల తెరమీద బొమ్మ కనపడుతుంది. ఎవరైనా కెమెరాతో రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే ఇన్ఫ్రా రెడ్ కిరణాలు అడ్డుపడతాయి. పెద్దపెద్ద నిర్మాతలు, సినీ ప్రముఖులు నన్ను కలిశారు. మా డివైజ్ డెమో చూశారు. పైరసీ సెక్యూర్డ్ బోర్డ్ గురించి వివరించడానికి చాలాసార్లు హైదరాబాద్ వచ్చాను. ఇక్కడే సెటిల్ అయ్యాను.
నా గురించి ‘గోల్డ్ సిక్కా లిమిటెడ్’ వాళ్లకు తెలిసింది. గోల్డ్ ఏటీఎమ్ పెట్టాలని వాళ్ల కోరిక. ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారట. మన అవసరాలకు తగ్గట్టు రీసెర్చ్ చేసి, గోల్డ్ ఏటీఎమ్‌ను డెవలప్ చేస్తారా? అని అడిగారు. ఆరు నెలల్లో 0.5 గ్రా. నుంచి 100 గ్రా. బంగారం ఇచ్చే ఏటీఎమ్‌ను తయారుచేశాను. గోల్డ్ ఏటీఎమ్ తయారు చేసిన తర్వాత జర్మనీ, దుబాయ్, ఆస్ట్రేలియా, ఈజిప్ట్ దేశాల నుంచి కొత్త ప్రాజెక్టులకు ఆర్డర్లు వచ్చాయి. ఆస్ట్రేలియన్ హెల్త్ కౌన్సిల్ గ్రామీణ ప్రాంతాల్లో ‘అటానమస్ క్లినిక్’ ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకుంది. హాస్పిటల్ లేనిచోట టెక్నాలజీ సాయంతో ఆరోగ్య సేవలు అందించే ప్రాజెక్ట్. రోగి మెషీన్ ముందు నిల్చుంటే రక్తపోటు సహా పదిహేను పరీక్షలు చేస్తుంది. మందులు సిఫారసు చేస్తుంది. డాక్టర్‌తో ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంటుంది. ‘అటానమస్ క్లినిక్’లో.. సాధారణ క్లినిక్‌లో ఉండే సేవలన్నీ ఉంటాయి. కానీ, మనుషులు కనపడరు. ఇక్కడ కూడా ఇలాంటి సర్వీస్ కోసం మెడికవర్ గ్రూప్‌తో పనిచేస్తున్నాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే మెడికల్ ఏటీఎమ్ తరలోనే రానున్నది. ప్రతి ఆవిష్కరణా సమాజానికి ఎంతోకొంత ఉపయోగపడాలి.
లండన్, దుబాయ్, సింగపూర్‌లో గోల్డ్ ఏటీఎమ్‌లు ఉన్నాయి. వాటిని జర్మన్ కంపెనీ తయారుచేసింది. అవి కనీసం 20 గ్రాముల బంగారాన్నే ఇస్తాయి. అలాంటి మెషీన్ల వల్ల భారతీయ
మార్కెట్లో పెద్దగా ఉపయోగం ఉండదు.
– నాగవర్ధన్ రాయల
“Gold ATM | డెబిట్ కార్డుతో మీకు నచ్చినంత బంగారం విత్‌డ్రా చేసుకోవచ్చు”
నగదు తీసుకోవాలంటే ఏటీఎం కార్డు అవసరం లేదు.. ఫోన్ పే, గూగుల్ పే ఉంటే చాలట.. అదెలా?”