అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమయ్యిందని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు మేరుగ నాగార్జున (Meruga Nagarujana) ఆరోపించారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యామీట్లను(Study meets) దగా మీట్లుగా అభివర్ణించారు.
వైసీపీ (YCP) హయాంలో విద్యా క్యాలెండర్ ప్రకారం ఫీజులు(Fees) అందేవని పేర్కొన్నారు. రూ. 72వేల కోట్లు కేటాయించి విద్యారంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాలు విద్యారంగ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయని వెల్లడించారు. ప్రభుత్వం రూ. 3,900 కోట్ల బకాయిలను విడుదల చేయడం లేదని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెడితే చంద్రబాబు (Chandra Babu) కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని , ప్రభుత్వ కుట్రలకు విద్యారంగం పూర్తిగా నాశనమైందని విమర్శించారు. ఉన్నత విద్యామండలిలలో ఇరవై మంది వైస్ ఛాన్స్లర్లను బెదిరించి రాజీనామాలు చేయించి ఇప్పటి వరకు ఎవరినీ కూడా భర్తీ చేయలేదని వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలను కాకుండా ప్రైవేట్ పాఠశాలు అభివృద్ధి చెందాలనే కుట్రతో ప్రభుత్వం అడుగులు వేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులున్నాయని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలోని వర్సిటీలకు వైస్ ఛాన్స్లర్ను ఎందుకు నియమించడం లేదని దుయ్యబట్టారు.