Somireddy Chandramohan Reddy | ఉచిత ఇసుక అంతా బూటకమే అని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. పేదలను దోచుకునేందుకు, టీడీపీ నేతలు జేబులు నింపుకునేందుకే ఇసుక విధానం తీసుకొచ్చారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. అక్రమాలపై ప్రశ్నించిన వారిపైనే దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
పొదలకూరు మండలం విరువూరు రీచ్ నుంచి అక్రమంగా రోజుకు 100 ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు పట్టించుకోకపోవడతో గ్రామస్తులే వారిని అడ్డుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రశ్నించిన వారిపైనే దొంగ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
సర్వేపల్లి ఎమ్మెల్య ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాకాలో ఇసుక దందా జోరుగా సాగుతోందని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. సోమిరెడ్డి అండదండలతోనే ఇసుకను తరలిస్తున్నారని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ జరగని అవినీతి జరుగుతుందని ఆరోపించారు. దీని మీద చంద్రబాబు విచారణ జరిపిస్తే సోమిరెడ్డి బాగోతం బయటపడుతుందని అన్నారు. చంద్రబాబు ర్యాంకులు ప్రకటిస్తే.. అవినీతిలో సోమిరెడ్డికి ఫస్ట్ ర్యాంకు వస్తుందని ఎద్దేవా చేశారు.