అమరావతి : ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందంటూ ఏపీ సచివాలయ ఉద్యోగులు వెనక్కి నడిచి నిరసనలు తెలిపారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా ఉద్యోగులను రెచ్చగొట్టేవిధంగా ప్రయత్నిస్తుందని పీఆర్సీ సాధన సమితి నాయకులు వెంకట్రాంరెడ్డి ఆరోపించారు. కొన్ని సంఘాలతో మాట్లాడినంత మాత్రాన తమ సమ్మె ఆగబోదని స్పష్టం చేశారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుంటే ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ప్రకటించారు.
డీడీఓలు,ట్రెజరీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటే ఆ రోజు నుంచే సమ్మె ప్రారంభమవుతుందని హెచ్చరించారు. చర్చలకు ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లి ప్రభుత్వానికి లేఖను అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను పక్కకు పెట్టి పాత జీతాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఒంగోలులో రెండో రోజు దీక్షలను ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రారంభించారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వాలి, పీఆర్సీ జీవోలను రద్దు చేయాలి, పాత జీతాలు ఇవ్వాలన్న తమ డిమాండ్లను అంగీకరిస్తేనే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని స్పష్టం చేశారు.