తిరుపతి: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చేపట్టే పరిశోధన ప్రాజెక్టులకు సహకరిస్తామని డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జీ సతీష్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆవిష్కరణల బాటలో పయనించాలని విద్యార్థులను చైతన్యపరిచిన ఆయన.. ఇంటర్న్‌షిప్‌లు, రీసెర్చ్ ప్రాజెక్టులు పొందేందుకు డీఆర్డీవో అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. పద్మావతి మహిళా యూనివర్శిటీ క్యాంపస్‌లో ‘ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులపై ఎండోమెంట్ లెక్చర్ సిరీస్’ను సతీష్ రెడ్డి ప్రారంభించారు.
పరిశోధనలు, ఆవిష్కరణల రంగాల్లో విశ్వవిద్యాలయం పురోగతిని డాక్టర్ సతీష్‌రెడ్డి ప్రశంసించారు. రెండేండ్ల కాల వ్యవధిలో 51 పేటెంట్లను పొందడం ద్వారా విశ్వవిద్యాలయం అభివృద్ధి దృష్టిని ఊహించవచ్చునన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి చెందిన 12 మంది ప్రొఫెసర్లు ప్రపంచ పరిశోధన రంగంలో టాప్ 100 మంది శాస్త్రవేత్తలలో చోటు దక్కించుకోవడం గొప్ప విషయమని చెప్పారు.
ఇదే కార్యక్రమంలో ‘డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసెర్చ్’ను ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి ప్రారంభించారు. భవిష్యత్‌లో స్మార్ట్ క్లాస్‌ల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇతర యూనివర్సిటీల్లో పద్మావతికి ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. ఉన్నత విద్యలో ఆధునిక బోధనా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని, ఆ దిశగా వివిధ విభాగాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పద్మావతి వర్శిటీ బయో-టెక్నాలజీ విభాగం డీఆర్డీఓకు నాలుగు ప్రాజెక్ట్ ప్రతిపాదనలను సమర్పించగా వాటిలో రెండు ఇప్పటికే ఆమోదం పొందాయి. ఈ కార్యక్రమంలో ఎస్పీఎంవీవీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ జమున, రిజిస్ట్రార్ డీఎం మమత, ప్రొఫెసర్ పీ ఉమా మహేశ్వరీదేవి, ప్రొఫెసర్ ఎస్ జ్యోతి, ప్రొఫెసర్ అనురాధ, డీన్ ప్రొఫెసర్ ఆర్ ఉష, ప్రొఫెసర్ ఎన్ రజని, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ లెక్చర్ సిరీస్‌ను చెన్నైలోని ప్రకాష్ ఫుడ్స్ & ఫుడ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ డీవీఆర్ ప్రకాష్ రావు స్పాన్సర్ చేస్తున్నారు.